పాటలో ఏముంది?
తమపైన తమకు ఎంత ప్రేమ ఉంటే మాత్రం!, ఎవరికివారు తమతో తాము ఎంత సేపని మాట్లాడుకుంటారు? జీవితానుభూతులన్నింటినీ తన ఒక్క మనసులోనే నింపుకుంటూ ఎంత కాలమని ప్రయాణిస్తారు? ఇది బాగా విసుగు పుట్టించే విషయమే! అందుకే, మనసు పంచుకునే మరో మనిషి కోసం ప్రతి ఒంటరి మనసూ వీలు చిక్కినప్పుడల్లా వెతుక్కుంటూనే ఉంటుంది. చీకటి వెలుగుల్లోనూ, కష్టసుఖాల్లోనూ వెన్నదన్నుగా ఉండే ఒక నిండు ప్రేమమూర్తి కోసం ఎడతెగని అన్వేషణ కొనసాగిస్తూనే ఉంటుంది. కాకపోతే, పక్కా చిరునామా ఏదీ లేని ఈ వెతుకులాట కొంత కష్టమైనదే! అయితే, ఒకటి మాత్రం నిజం! ఒక మహా తపస్సులా సాగిన ఏ అన్వేషణా ఎప్పటికీ వృధా పోదు. తాను అంతగా కోరుకున్న ఆ ప్రేమమూర్తి కాస్త ఆలస్యంగానే అయినా, ఎక్కడో, ఎప్పుడో ఎదురుబడకుండా ఉండదు. మనసంతా వ్యాపించకుండా ఉండదు. ఆ తర్వాత అయినా జీవితం తాలూకు వ్యధలూ బాధలూ అసలే ఉండవని కాదు గానీ, మొత్తంగా చూస్తే ఆశించిన ఆ ఆనందానుభూతి ఏదో ఒక స్థాయిలో లభించే తీరుతుంది. అప్పటిదాకా ఆమె కోసమైన అతని అందమైన కల కొనసాగుతూనే ఉంటుంది. నిలువెల్లా పెనవేసుకుపోయిన ఆ అందమైన కలే 1964లో విడుదలైన ’డాక్టర్ చక్రవర్తి’ సినిమాలోని ఈ పాటలో కనిపిస్తుంది.
శ్రీశ్రీ రాసిన ఈ పాటను సాలూరి రాజేశ్వరరావు స్వరబద్దం చేస్తే, జీవితపు మధుర జ్వాలల్ని తన గొంతులో ఎంతో మనోహరంగా పలికించాడు ఘంటసాల. ఆ రసానంనద ఝరుల్లో తేలాడటం తప్ప ఇప్పుడు మన కింక వేరే ధ్యాస ఏముంది? ఎవరు ఏమనుకుంటే ఏమవుతుందిలే గానీ, భూమ్యాకాశాలను ఏకం చే స్తున్న ఆ రసానందసీమే ఇప్పుడు మనకున్న ఏకైక లోకం!
మనసున మనసై...!!
తోడొకరుండిన అదే భాగ్యమూ ..., అదే స్వర్గమూ // మనసున //
మనసు ... ఆకాశం.
మట్టితో మట్టి కలిసిపోయినట్లు బ్రతుకుతో బ్రతుకు సునాయాసంగానే కలిసిపోతుంది. కానీ, మనసుతో మనసు కలిసిపోవడమే ఎంతో కష్టమవుతుంది. ఎందుకంటే ఏ మన సైనా ఒక మహా అంతులేని ఆకాశం కదా! ఆకాశం అంటే ఉత్తి శూన్యం అని కూడా కాదు! అది కోటానుకోట్ల గ్రహాల సమేతం. అనంత కోటి నక్ష త్రాల ఆవాసం. అందులోని, దాన్నో దీన్నో మన సౌకర్యార్థం, అటో ఇటో కదల్చడం, నేల మీదున్న వాగుల్నో, వంపుల్నో పక్కదోవ పట్టించినంత సులభం కాదు మరి! మానవుడి హృదయాకాశం పరిస్థితి కూడా దాదాపు ఇదే! ఎందుకంటే, ప్రతి వ్యక్తీ వేవేల అభిప్రాయాల్నీ ఆలోచనలల్నీ, ఆశయాల్నీ, అన్నింటినీ మించి అనేకానేక లక్ష్యాల్నీ, సిద్ధాంతాల్నీ తన హృదయాకాశంలో ఎంతో బలంగా ప్రతిష్టించుకుని ఉంటాడు. ఎవరైనా ఏ కారణంగానో వాటిని కదిల్చే ప్రయత్నం చేస్తే అది అంత సులభంగా జరిగే పని కాదు. ఒక రకంగా ఆ ప్రయత్నం, ఉప్పెనను ఎగదోయడం లాంటిది. అగ్ని సరస్సును జీవన స్రవంతిలో కలిపేయడం వంటిది. వింత ఏమిటంటే, ఆకాశం అంత గొప్పదే అయినా, ఎప్పుడైనా తనకు తానుగా ఏవైనా మార్పులు చేసుకోవాలనుకుంటే, ఆ మార్చుకునే శక్తి మాత్రం ఆ ఆకాశానికి ఉండదు. కానీ, అంతో ఇంతో ఉంటే ఆ అవకాశం మనిషికే ఉంటుంది. ఆ సావకాశాలన్నింటినీ ప్రోగు చేసుకుని, తన ప్రేమమూర్తిని గుండెల్లోకి తీసుకునే ప్రయత్నంలో అతని మనసు ఏ మాత్రం వెనుకాడదు. తన సర్వ శక్తులూ వెచ్చించి ఆ ఆనంద మూర్తిని సాధించే తీరతాడు. అప్పుడింక మనసూ, బ్రతుకూ ఆనందంగా కలగలిసిపోయిన ఆ మహా సౌభాగ్యాన్ని అతడు తనివితీరా ఆస్వాదిస్తాడు. ఆ మాధురీ హృదయ నాదంలో ఓలలాడుతూ జీవితమంతా హాయిగా గడిపేస్తాడు.
చీకటి మూసిన ఏకాంతములో
తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గమూ // మనసున //
కలగన్న ఆశలు గానీ, ఆశయాలు గానీ, మొత్తంగా నెరవేరిన దాఖలాలు ఏ జీవితంలోనైనా ఉన్నాయా? అంటే, అసలే లేవు. ఏ ఉన్నత స్థానంలో ఉన్నా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఎంత గొప్ప అనుభపజ్ఞుడైనా సరే అతడు కలగన్న వాటిలో పది శాతమైనా నెరవేరవు. సమస్య ఏమిటంటే, చాలా మందిలో ఆ నెరవేరిన సంతోషమేమీ పెద్దగా ఉండదు గానీ, నెరవేరని వాటి తాలూకు వ్యధల్లో మాత్రం వారు బాగా కూరుకుపోతారు. ఇది మనసు సహజ గుణం. అయితే ఎవరి ఆశలు ఎందుకు నేరవేరలేదని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం చెబుతాం? ఎవరి వైఫల్యాల వెనుక ఏ బలమైన కారణాలు ఉన్నాయో వాటి గురించి ఎవరికి వారు తెలుసుకోవలసిందే తప్ప అవి ఎదుటివారు చె ప్పగలిగేవి కాదు. ఎవరి అంచనాల మాట ఎలా ఉన్నా, నెరవేరని ఆశలు, చేజారిపోయిన విజయాలు, ఏ మనసునైనా కలత పెట్టకుండా ఉండవు. జీవితాన్ని ఏదో ఒక మేరకు అల్లకల్లోలం చేయకుండా ఉండవు. ఆ కల్లోల హృదయంలో నిజంగా ఒక లావాలాంటి ఆవేశమే పుడుతంది. ఆక్రోశమే కాదు దాని వెనకాల అంతులేని ఆవేదన కూడా ఉంటుంది. ఇవన్నీ కలగలిసిన ఒకానొక దశలో లోకమంతా ఏదో కారుచీకట్లు కమ్మేసినట్లే అనిపిస్తుంది.. మనసు అయోమయంలో పడిపోతుంది. ఇలాంటి పరిణామాల్లో చాలా మందిని ఏకాంతం కాదు, ఒక కీకారణ్యం లాంటి ఏకాకితనం కమ్ముకుంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక మహా కాంతిపుంజంలా ఒక హృదయ మూర్తి ఎవరైనా, తన ఒంటరి లోకంలోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుంది? ఎప్పటికీ వీడని ఒక తోడై నిలిస్తే ఎలా ఉంటుంది? వారి జీవితాల్లో అక్షరాలా అది ఒక మహోత్సవమే ... వారి జీవనయానంలో అదో స్వర్గధామమే!
నేనున్నానని నిండుగ పలికే
తోడొక రుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గమూ // మనసున //
కాదనడానికి ఏముంది? ప్రతి వ్యక్తీ ఒక ప్రత్యేక ప్రపంచమే! అలా ఒక ప్రపంచంగా విరాజిల్లే ఆ వ్యక్తిలో కచ్ఛితంగా కొన్నయినా ఇతరులు అతన్ని ప్రేమింపచేసేవిగా ఉంటాయి. ఆ మాటకొస్తే, అతన్ని ద్వేషింపచేసే అంశాలు కూడా ఏదో ఒక మేర అతనిలో ఉంటాయి. కాకపోతే, లోకంలో నీ సామర్థ్యాల్ని ప్రశంసించే వాళ్లు అతి స్పలం్పగానూ, నీ లోపాల్ని చూసి నిన్ను విమర్శించేవాళ్లు అత్యధికంగానూ ఉంటారు. అలాంటప్పుడు జీవన నేస్తాలు, కుటుంబ సభ్యులు, అయినవాళ్లూ, ఆత్మీయులు కూడా ఆ ద్వేషించే వారి గుంపులో చేరిపోవడం అవసరమా? అతని వల్ల ఏమైనా పొరపాటు జరిగి ఉంటే, సానుభూతితో వాటిని అధిగమించే సాయం అందించాలి గానీ, అతన్ని, దోషిలా చూస్తూ ఉండిపోతే ఎలా? ఇప్పటిదాకా నీవాళ్లుగా, నీ ఆత్మీయులుగా చలామణీ అయిన వారు, నీ లోపాలకు అతీతంగా నిన్ను చూడగలగాలి! నిన్ను నిన్నుగా ప్రేమించగలగాలి. లోకానిది ఏముంది? దానికి వేయి నాలుక లు. . ఒక్కో సమయాన. అది ఒక్కోలా మాట్లాడుతుంది. నిన్న మొన్నటిదాకా నిన్ను ఎంతగానో శ్లాఘించిన ఆ వర్గమే ఉన్నట్లుండి, నీ పైన కత్తికట్టవచ్చు. దారుణంగా హింసించనూవచ్చు.. దాంతో అప్పటిదాకా అందరిలా నేనూ ఈ ప్రపంచంలో సమ భాగస్తుణ్ణే అనుకుంటూ వచ్చిన వాడు కాస్తా, నాకెవరూ లేరు. ఈ ప్రపంచానికి నేను పూర్తిగా పరాయివాణ్ననుకునే స్థితికి వచ్చేస్తాడు. కొందరైతే లోకాన్ని మొత్తంగానే ఏవగించుకుని, లోకాన్నే వదిలేయాలనుకుంటారు! సరిగ్గా ఆ స్థితిలో ఎవరో వచ్చి, నీకు దాపుగా నిలబడి, ఎప్పటికీ నీకు అండదండగా ఉంటానంటూ ఒక పూర్తి స్థాయి భరోసా ఇస్తే అప్పుడింక అంతకన్నా ఏం కావాలి? ఆరోహణలోనూ, అవరోహణలోనూ, జీవితపు అన్ని దశల్లోనూ, అన్ని దారుల్లోనూ, నీతో కలిసి నడుస్తానన్న ఆ మనిషి ఏకంగా నీ జీవితంలోకే ప్రవేశిస్తేనో...! అప్పటి వారి మనస్థితిని ఆనందమనే ఆ అతిసాధారణమైన మాటతో కాకుండా దానికి వేయింతలు గొప్పదైన మరే మాటైనా చెప్పుకోవాలి!
నీ వ్యధ తెలిసి, నీడగ నిలిచే
తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గమూ // మనసున //
ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎందుకంటే అది నిత్య పరిణామశీలి. ఒకసారి అది పూవులా ఉంటుంది. ఒకసారి అగ్ని గుండంలా ఉంటుంది. ఒక్కోసారి, ఇంకాసేపట్లో వ ర్షించి మహోత్పాతాన్నే సృష్టిస్తుందనిపించే భీకర ఆకాశంలా ఉండి మరికాసేట్లో అదేమీ లేని ఒక మహా యోగినీ హృదయంలా దర్శనమిస్తుంది. ప్రేమ ఒక్కోసారి మహోత్తుంగ తరంగంలా ఎగిసినట్లే ఎగిసి అంతలోనే సముద్రంలో కలిసిపోయి, పరమ నిర్మలత్వాన్నీ, నిశ్చలత్వాన్నీ ప్రదర్శిస్తుంది. ఏమైనా, అప్పటిదాకా ఆకాశ వీధుల్లో విహరించిన ప్రేమ ఏ కారణంగానో అక్కడి నుంచి దిగిరావడానికి పూనుకున్నా, కనీసం అది నే లపైనైనా ఉండిపోవాలి కదా! అలా కాకుండా నేరుగా అది పాతాళంలోకే జారిపోతే ఎలా? నిన్నమొన్నటి దాకా హృదయంలో హృదయంగా, జీవితంలో జీవితంగా ఉన్న ఇలాంటి అనేక మంది, ఒక్కోసారి హఠాత్తుగా ఇలా ఎందుకు దూరమైపోతారు? ... అంటే ఏం చెబుతాం? ఎవరి పరిస్థితులు వారివి! నిజానికి, ఇరువురూ ప్రేమలో పడిన నాడు ఇవన్నీ లేవు మరి! అప్పుడు లేని ఈ తరహా పరిణామాలెన్నో ఆ తర్వాత ఒక్కొక్కటిగా వచ్చిపడుతుంటాయి. వాస్తవానికి, అలా మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోవాలి. కానీ, అవి అలా పోకపోగా, ఇంకా లోలోతులకు పాతుకుపోతాయి. వాటిని నిరోధించే ఏ ప్రయత్నమూ ఏ వైపునుంచీ ఎవరూ చేయకపోతే, ఇలా కాక ఇంకేమవుతుంది? ఇదంతా చాలదన్నట్లు,, కొందరు నిలువెత్తు విద్వేషాలూ, ఆగ్ర హాలూ ఎగజిమ్ముతారు. . నిజానికి హృదయ బంధాల్ని పైపైనే చూస్తూ రగిలిపోయేవారే తొందరపడి బంధాలను తెంచుకోవడానికి సిద్ధమైపోతారు. అలా కాకుండా, అంతరంగపు లోలోతుల్లోకి వెళ్లి , వ్యధను, అంతర్వేదననూ ఆమూలాగ్రం అర్థం చేసుకున్న వారైతే అలా వెళ్లలేరు. పైగా నీ సమస్త క్షోభల్ని రూపుమాపి పూర్వవైభవంతో మళ్లీ నిన్ను నిలబెట్టడానికి తమ సర్వశక్తులూ ధారవోస్తారు. ఆ ప్రయత్నంలో రోజులూ నెలలే కాదు. జీవితకాలమంతా నీతోనే, నీలోనే ఉండిపోతారు. ఆ క్రమంలో సమస్త సంకెళ్ల నుంచి నీకు విముక్తి కలిగించి, నీకు నీడనిస్తారు. నీ మనసుకు ఓదార్పునిస్తారు. నీ చుట్టూ వేల ప్రభాకరుల్ని నిలబెట్టి, నీ దారిపొడవునా ఒక ఉజ్వల కాంతినీ, నీ జీవితానికి ఒక నిండు శాంతినీ ప్రసాదిస్తారు. ఒక మహోజ్వలమైన భావనా స్రవంతిలో మనసున మనసైపోవడం అంటే ఇదే మరి!!
- బమ్మెర
అందమె ఆనందం....! పాట | బ్రతుకు తెరువు సినిమా